Post

సంస్కరణల హద్దులు దాటిన స్వేచ్ఛాగళం: చలం

తెలుగు సాహిత్యంలో స్త్రీ గురించి మాట్లాడటం వేరు, స్త్రీ స్థానంలో నిలబడి ఆమె అనుభూతిని, ఆక్రందనను ఆవిష్కరించడం వేరు. ఇరవై ఒకటవ శతాబ్దపు ఆధునిక స్త్రీవాద సిద్ధాంతాలు మన దేశంలో చర్చకు రాకముందే, వందల ఏళ్ల పాతివ్రత్యపు కంచెలను తెంచి, "స్త్రీకి కూడా శరీరం ఉంది, దానికి స్వేచ్ఛ కావాలి; మెదడు ఉంది, దానికి ఆలోచనా శక్తి కావాలి; హృదయం ఉంది, దానికి అనుభవం కావాలి" అని బిగ్గరగా చాటిన ఏకైక తిరుగుబాటుదారుడు గుడిపాటి వెంకట చలం.

ఈ రోజుల్లో చలం పుస్తకాలు చదివి, "ఇందులో ఏముంది? అంత విప్లవాత్మకమైన విషయమేముంది?" అని తేలిగ్గా కొట్టిపారేసేవాళ్లు చాలామంది ఉన్నారు. నేటి స్వేచ్ఛా వాతావరణంలో, ఆధునిక దృక్కోణం గుండా ఆనాటి ఆయన రాతలను చూస్తే అవి సాధారణంగా అనిపించవచ్చు. కానీ, వందేళ్ల క్రితం ఆచారాల ముసుగులో బతుకుతున్న సమాజంలో నిలబడి... ఆ సంకెళ్లను, పతివ్రతా ధర్మాల కపటత్వాన్ని ధిక్కరిస్తూ ఆ అక్షరాలు రాయడం అంటే మాటలు కావు. ఆ కాలంలో సమాజపు మూఢనమ్మకాలకు ఎదురెళ్ళి అంత పచ్చి నిజాన్ని రాయడం కంటే... ప్రాణాలు వదిలేయడమే బహుశా చాలా తేలికైన పని!

చలానికి ముందున్న కందుకూరి వీరేశలింగం వంటి తొలితరం సంస్కర్తలు స్త్రీల వితంతు పునర్వివాహాలు, విద్యాభ్యాసం గురించి మాట్లాడారు. కానీ వారి దృష్టిలో స్త్రీ ఒక 'జాలిచూపి బాగుచేయాల్సిన బాధితురాలు'. చలం దగ్గరకొచ్చేసరికి ఆ దృక్పథం మూలమలుపు తిరిగింది. చలానికి స్త్రీ జాలి దయ కోరే అబల కాదు; స్వయంసమృద్ధి, స్వీయ కోరికలు, ఆత్మగౌరవం ఉన్న ఒక పూర్తి స్థాయి మనిషి. పురుష సమాజం ఆమెను వంటగదికి, పిల్లల్ని కనే యంత్రానికి పరిమితం చేసి, 'పతివ్రత' అనే కాగితపు పూల మాల తొడిగి ఎలా బంధించిందో చలం తన పదునైన కలంతో చీల్చిచెండాడారు.

చలం రాసిన మైదానం నవలలోని రాజేశ్వరి పాత్రను నాటి సమాజం విపరీతంగా నిందించింది. కానీ చలం చూపించింది ఒక స్త్రీకి తన జీవితంపై, తన శరీరంపై ఉన్న సార్వభౌమాధికారాన్ని. ప్రేమ లేని, మానసిక గౌరవం లేని వివాహ బంధంలో నిత్యం చస్తూ బతకడం కంటే, సామాజిక కట్టుబాట్లను తెంచుకుని తనకిష్టమైన స్వేచ్ఛను వెతుక్కోవడం తప్పు కాదని రాజేశ్వరి పాత్ర ద్వారా ప్రతిపాదించారు.

బ్రాహ్మణీకం, అరుణ, విషాదం వంటి నవలల్లోను, వితంతువు వంటి కథల్లోను సమాజం కల్పించిన కృత్రిమ నైతికతను ఎండగట్టారు. వితంతువుల లైంగిక, మానసిక ఆకాంక్షలను లోతుగా పరిశీలించి, వారి వేదనకు కారకులైన పురుషాధిక్య ధర్మాన్ని నిలదీసే ధైర్యం ఆ రోజుల్లో ఒక్క చలానికి మాత్రమే సాధ్యమైంది.

చలం విమర్శ కేవలం సాంప్రదాయవాదుల పైనే కాదు, బయట వేదికలపై సంస్కరణలు మాట్లాడుతూ ఇంట్లో భార్యను బానిసలా చూసే 'ఆధునిక' పురుషుల దంభాచారం పైన కూడా. మ్యూజింగ్స్ లోనూ, తన వివిధ వ్యాసాల్లోనూ పురుషాధిక్య మానసికత్వాన్ని చాలా నిర్దయగా ఎండగట్టారు.

ఆయన ఆలోచనలు కేవలం పుస్తకాలకే పరిమితం కాలేదు; ఆయన ఆచరణలోనూ అవే కనిపించాయి. కాకినాడ, రాజమండ్రి రోజుల్లో తన భార్య రంగనాయకమ్మను స్కూల్లో చేర్పించి, ఆమెను తన సైకిల్ వెనుక కూర్చోబెట్టుకుని తీసుకెళ్తుంటే నాటి సమాజం వింతగా, నిందాపూర్వకంగా చూసింది. వీధిలో భార్యాభర్తలు కలసి నడవడమే అపచారంగా భావించే కాలంలో చలం ఆ పని చేశారు. అందుకే ఆయన అక్షరాల్లో వినిపించే ఆగ్రహం సిద్ధాంతాల నుంచి వచ్చింది కాదు, సమాజపు కపటత్వాన్ని స్వయంగా చూసి అనుభవించిన రగిలే బాధ నుంచి పుట్టుకొచ్చింది.

ఈనాడు మనం పదేపదే మాట్లాడుకుంటున్న 'రీప్రొడక్టివ్ రైట్స్' (సంతానోత్పత్తి హక్కులు), సంతాన నియంత్రణ, ఆర్థిక స్వావలంబన వంటి అంశాలను చలం ఆనాడే స్త్రీ, బిడ్డల శిక్షణ వంటి గ్రంథాల్లో స్పష్టంగా చర్చించారు. పిల్లల్ని కనాలా వద్దా, ఎప్పుడు కనాలి అనే నిర్ణయం పూర్తిగా స్త్రీదే కావాలని స్పష్టం చేశారు. స్త్రీ ఆర్థికంగా పురుషుడిపై ఆధారపడినంత కాలం ఆమెకు పరిపూర్ణ స్వేచ్ఛ దక్కదని గ్రహించిన అరుదైన దార్శనికుడు చలం.

నాటి సమాజం చలాన్ని 'బూతు రచయిత' అని ముద్రవేసి, ఆయన పుస్తకాలను బహిరంగంగా చదవడానికి కూడా భయపడేలా వాతావరణం సృష్టించింది. కానీ చలం రాసింది బూతు కాదు; సమాజం కప్పిపుచ్చుకున్న నీచమైన ముసుగులను లాగిపారేసిన పచ్చి నిజం.

ఇదంతా విన్నాక మీలో చాలామందికి ఒక ప్రశ్న రావచ్చు… "ఏమయ్యా రాజేష్, ఇన్ని కబుర్లు చెప్తున్నావ్, నువ్వేమైనా గొప్పవాడివా? బయట పడిపోకుండా నీ పరిధుల్లో నువ్వు బతుకుతూ ఈ మాటలన్నీ చెప్పడం తేలికేగా!" అని. నిజమే, నా సమాధానం 'నేనేమీ గొప్పవాడిని కాదు' అనే. నిజానికి మనం ఎవ్వరం అంత గొప్పవాళ్లం కాకపోవచ్చు. రోజూ సమాజపు కపటత్వాన్ని ఎండగడుతూనే, ఏదో ఒక మూల మనం కూడా అదే కపటత్వంతో, ఆ ముసుగుల వెనుకే బతికేస్తున్నాం. నాలోనూ ఆ బలహీనతలు ఉన్నాయి.

కానీ చలం చూపించిన నిజాన్ని గుర్తించి, కనీసం ఆ దిశగా ఆలోచించడానికైనా ఒక చిన్న ప్రయత్నం చేయడమే ఇక్కడ ముఖ్యం. మనం పరిపూర్ణులం కాకపోవచ్చు, కానీ అసలు ప్రయత్నమే చేయకపోవడం అన్నింటికంటే పెద్ద తప్పు. మనలోని ఆత్మావలోకనాన్ని, తిరుగుబాటును చంపేసి, కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోతున్నాం కాబట్టే... బహుశా ఈ రోజుల్లో మన మధ్య మరొక చలం పుట్టుకురావడం లేదేమో..

సరే, ఇవన్నీ పక్కన పెడితే... నా వ్యక్తిగత ఇష్టానికి వస్తే, నాకు 'మైదానం' కంటే బాగా నచ్చిన ఆయన రాత 'బ్రాహ్మణీకం'. మైదానంలో కనిపించేది ఒక ఆవేశభరితమైన, బహిరంగ తిరుగుబాటు అయితే, బ్రాహ్మణీకంలో చలం ఆవిష్కరించింది సమాజపు పట్టింపులు, కఠినమైన సంప్రదాయ నియమాల మధ్య నిశ్శబ్దంగా నలిగిపోయే ఒక స్త్రీ అంతరంగ మథనం.

ఇక్కడ విమర్శ కేవలం ధర్మం అనో, విశ్వాసాల అనో కాదు... ధర్మానికి ఉన్న అసలైన స్ఫూర్తిని పక్కనపెట్టి, మనుషుల భావోద్వేగాల కంటే కట్టుబాట్లకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చే ఆనాటి సమాజపు సంకుచితత్వాన్ని చలం చాలా పదునుగా, లోతుగా ఎండగట్టారు. ఆ కఠినత్వంలో ఒక స్త్రీ అనుభవించే మానసిక వేదనను చదువుతుంటే మనసు కలచివేస్తుంది. బహుశా అందుకే, మైదానంలోని ఆవేశం కంటే, బ్రాహ్మణీకంలో చలం చూపించిన ఈ నిశ్శబ్ద ఆవేదనే నన్ను ఎక్కువ కాలం వెంటాడింది... ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది.

This post is licensed under CC BY 4.0 by the author.